పెట్రోల్ బంకుల్లో జరిగే 4 రకాల మోసాలు... ఈ సారి బంక్ కు వెళితే ఇవి గమనించండి.
వ్యక్తిగత వాహనాల్లో నిత్యం ఆఫీసులు, కాలేజీలు, ఇతర పనుల కోసం వెళ్లే వారు పెట్రోల్, డీజిల్ కొట్టించడం, తిరగడం సహజమే. ఈ క్రమంలో ఇంధన ధరలు పెరిగినప్పుడల్లా వాహనదారులపై అదనపు భారం పడుతోంది. అయినప్పటికీ వ్యక్తిగత వాహనాల్లో వెళ్లేవారు వాటిని విడిచిపెట్టడం లేదు. అయితే ఎవరి అవసరం వారికి ఉంటుంది లెండి. అందుకే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా ఎవరూ తమ సొంత వాహనాల్లో వెళ్లడం మానడం లేదు. ఎందుకంటే వాటిలో ఉన్న సౌకర్యం అటువంటిది మరి. అయితే ఇంధన ధరలు పెరిగితే దాంతో పడే భారాన్ని సహజంగా ఎవరైనా భరిస్తారు, కానీ ఇంకో విధంగా భారం పడితే..?అప్పుడు దాన్ని ఎవరూ భరించలేరు. అదేంటీ, ఇంధన ధరలు పెరగకుండా ఇంకో విధంగా భారం ఎలా పడుతుంది? అని ఆలోచిస్తున్నారా..? అదేనండీ, పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాల వల్ల..! అవును, మరి. వారు మోసం చేసి పెట్రోల్ తక్కువగా కొడితే, అలా పదులు, వందల సంఖ్యలో జరిగితే..? అప్పుడు భారం ఎవరిపై పడుతుంది..? మనపైనే కదా..! అందుకే కనీసం ఆ భారం అయినా పడకుండా ఉండాలంటే వారు చేసే మోసాలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా గుర్తించాలో మనం కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. లేదంటే మన పెట్రోల్, డీజిల్ ఖర్చు భారం మన నెల బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంది.
దృష్టి మరల్చడం…
పెట్రోల్, డీజిల్ కొట్టించే ముందు రీడింగ్ సున్నా చేసి ఫ్యుయల్ నింపుతారు కదా. అయితే మన ముందు మాత్రం రీడింగ్ సున్నా చేస్తారు. కానీ కొంత ఫ్యుయల్ కొట్టగానే మనల్ని నెమ్మదిగా మాటల్లో పెట్టి రీడింగ్ మార్చడం, లేదా ఇంధనం తక్కువగా కొట్టడం చేస్తారు. దీంతో మనకు రావల్సిన ఫ్యుయల్ రాదు. కాబట్టి ఫ్యుయల్ నింపే సమయంలో రీడింగ్‌నే చూడాలి. ఎవరు ఎలా డిస్టర్బ్ చేసినా దృష్టి మార్చకూడదు.
నాజిల్‌ను పదే పదే ప్రెస్ చేయడం…
పెట్రోల్ బంకుల్లో ఫ్యుయల్ నింపే సమయంలో కొందరు వర్కర్లు పదే పదే ఫ్యుయల్ నాజిల్‌ను ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇది మనకు అంతగా కనిపించదు. ఎందుకంటే మనం రీడింగ్‌పై దృష్టి పెడతాం కదా. అప్పుడు వారు నాజిల్‌ను ప్రెస్ చేస్తూ ఉంటారు. దీంతో కొంచెం ఫ్యుయల్ మనకు తక్కువగా వస్తుంది. టూ వీలర్స్ కాకుండా కార్ల వంటి ఫోర్ వీలర్స్‌లో ఉన్న వారు ఒక్కోసారి వాహనం దిగకుండానే ఫ్యుయల్ పోయిస్తుంటారు. దీని వల్ల పెట్రోల్ బంక్ వర్కర్లు ఇంకా ఎక్కువ మొత్తంలో ఇంధనాన్ని తస్కరించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనం దిగి ఫ్యుయల్ రీడింగ్‌ను చూసుకోవాలి. అంతేకాదు, నాజిల్‌పైనా ఓ కన్నేయాలి.
పెద్ద పెద్ద పైపులను వాడడం…
సాధారణంగా ఏ పెట్రోల్ బంకులోనైనా ఫ్యుయల్ నింపే పైపులు పెద్దగా ఉంటాయి. ఈ క్రమంలో ఫ్యుయల్ మెషిన్‌కు దగ్గరగా ఉంటే ఆ పైపులు వంగిపోతాయి. దీని వల్ల కొంత ఫ్యుయల్ ఆ పైపుల్లో ఆగిపోతుంది. దీంతో మనకు రావల్సిన ఫ్యుయల్ రాదు. అయితే దీన్ని నివారించాలంటే వాహనాన్ని మెషీన్‌కు కొంత దూరంలో నిలపాలి. దీని వల్ల పైపు సాగినట్టు అవుతుంది. అప్పుడు వాటిలో ఫ్యుయల్ ఆగేందుకు అవకాశం ఉండదు.
మెషిన్లను ట్యాంపర్ చేయడం…
కొన్ని పెట్రోల్ బంకుల్లో మెషిన్లను ట్యాంపర్ చేస్తారు. దీని వల్ల ఫ్యుయల్ క్వాంటిటీలో తేడా వస్తుంది. మనకు రావల్సిన మొత్తంలో ఫ్యుయల్ రాదు. అయితే దీన్ని ఎలా కనుక్కోవాలంటే ఎప్పుడైనా మీరు పెట్రోల్, డీజిల్ కొట్టించినప్పుడు తక్కువ ఫ్యుయల్ వచ్చిందని అనుమానం వస్తే వెంటనే అదే పెట్రోల్ బంక్‌లో టెస్ట్ చేసుకోవచ్చు. అందుకోసం 5 లీటర్ల క్యాన్‌లు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఫ్యుయల్ కొట్టించి ఎంత వస్తుందో చూడాలి. తక్కువగా వస్తే సదరు పెట్రోల్ బంక్‌పై సంబంధిత అధికారులకు మీరు ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా ఫ్యుయల్ నాణ్యంగా లేకపోయినా, నాసిరకంగా ఉన్నా అదే పెట్రోల్ బంక్‌లో ఫిల్టర్ పేపర్ టెస్ట్ ఉంటుంది. దాన్ని కూడా మీరు అడిగి చేయించుకోవచ్చు. ప్రతి పెట్రోల్ బంక్‌లోనూ ఈ రెండు టెస్ట్‌లను ఉచితంగా చేస్తారు. వాటిలో ఏవైనా తేడాలు గమనించినట్టయితే సంబంధిత అధికారులకు మీరు ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చు.
పైన చెప్పిన సూచనలు పాటిస్తే మీకు ఇంధనం నాణ్యమైంది అందడమే కాదు, సరైన పరిమాణంలో లభిస్తుంది. దీంతో మీ నెలవారీ ఫ్యుయల్ ఖర్చులు అదుపు తప్పకుండా ఉంటాయి.